• బీరకాయ తింటున్నారా?
జ్వరం వచ్చినప్పుడు పత్యం కూరలా బీరకాయ వండుతుంటారు. అయితే ఈ కాయలే కాదు, బీరపాదు మొత్తం ఔషధపూరితం అని వైద్యులూ అంటున్నారు.
సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్-సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థైమీన్... వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెల్యులోజ్ ఎక్కువగా ఉండటంతో ఇది మలబద్ధకాన్నీ మొలలవ్యాధినీ అద్భుతంగా నివారిస్తుంది.
* బీరకాయల్లోని పెప్టైడ్లూ ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడంద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది.
* బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది.
* కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది.
* అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుందట.
* బీరకాయలోని విటమిన్-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని నేషనల్ ఐ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంటోంది. దీన్ని ఆరేళ్లపాటు ఆహారంలో భాగంగా చేసుకున్నవాళ్లలో కంటి కండరాల క్షీణత 25 శాతం వరకూ తగ్గిందట. ఇందులోని విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట.
* బీరకాయల్లోని విటమిన్ బి6 అనీమియాను నివారించగలదనీ తేలింది. కాబట్టి బీరకాయ అనేక వ్యాధుల్నీ అరికడుతుందని గుర్తుంచుకోండి.
No comments:
Post a Comment