Tuesday 20 June 2023

ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు**రోజు ఎలా యోగ చేయాలి యోగ వల్ల ఉపయోగంలు ఏమిటి

*ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు*
*రోజు ఎలా యోగ చేయాలి    యోగ వల్ల ఉపయోగంలు ఏమిటి*

యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలంటే మీరేమీ పెద్దగా ఖర్చు చేయనdక్కరలేదు . దీనికి కావలసినవి మంచి వెంటిలేషన్ వున్న గది, ఒక కార్పెట్ , ఆసనాలు వేయడానికి తేలికపాటి చుడీదార్ లేదా స్పోర్ట్ సూట్ మాత్రమే .
యోగాసనాలు
                           యోగాభ్యాసమన్నది మన పూర్వీకులు మనకందించిన అమూల్యమైన ఆరోగ్య విజ్ఞానం అని చెప్పుకోవచ్చు. దీనిని ప్రాక్టీస్ చేయడానికి వయసు పరిమితి లేదు. మూడేళ్ళ పసికందు నుండి, తొంభై ఏళ్ళ పై బడిన వయసు వారి వరకు అందరూ యోగాసనాలు వేయవచ్చు . ఏవైనా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు, ఆపరేషన్లు జరిగినవారు మాత్రం వారి డాక్టర్ ను సంప్రదించి మొదలుపెట్టడం మంచిది .

               యోగాను ఒక సైన్స్ గా అభివర్ణించవచ్చు . పతంజలి అనే ఋషిని యోగశాస్త్ర పితామహుడిగా చెప్తారు.  క్రీస్తు పూర్వం నాడే  వర్ధిల్లిన ఈ విజ్ఞానం, క్రీస్తు శకం లోని వారికి కూడా ఆరోగ్యం అందించగలుగుతుంది. ఏరోబిక్స్ వంటి ఆధునిక వ్యాయామ పద్ధతులు శరీరానికి కొంత మేలు చేయగలుగుతున్నా, ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో యోగాకి సాటి ఏదీ లేదని చెప్పుకోవచ్చు.పూర్తి సలహాలు కోసం


https://www.facebook.com/1536735689924644/posts/2150676281863912/

యోగాసనాల్లో నియమాలు

                ఆరోగ్యంతో పాటు , జ్ఞాపక శక్తిని పెంపొందించే యోగను వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ అభ్యసించవచ్చు . ఎనిమిదేళ్ళ పిల్లల నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధులు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు . ప్రారంభంలో తేలిక ఆసనాలు వేస్తూ , తరవాత కష్టతరమైన ఆసనాలను ప్రాక్టీస్ చేయడం మంచిది. ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు . ఎలా పడితే అలా వేయకూడదు . వాటికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది .

1. ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఆసనాలు వేయడం మంచిది . ఒకవేళ ఉదయం సమయం అనుకూలం కాకపోతే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అయితే మంచిది . భోజనం తరవాత కనీసం నాలుగు గంటల వ్యవధి ఉండాలి.
2. యోగాసనాలు వేయడానికి ముందు టీ, కాఫీ , పళ్ళరసం , నీళ్ళు మొదలైనవి తీసుకుంటే, కనీసం అరగంట వ్యవధి ఉండాలి . 
3. రోజూ ఒకే సమయానికి యోగాసనాలు వేయాలి, రోజులో ఒక్కసారే ప్రాక్టీస్ చేయాలి .
4. పరుపుల మీద, బెడ్ మీద యోగాసనాలు వేయకూడదు.
5. నేలమీద ఒక దుప్పటి గాని , మందపాటి తివాచీ గాని, చాప గాని వేసి యోగాసనాలు వేయాలి.
ఈ ప్రదేశం దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉండాలి. కిటికీల తలుపులు పూర్తిగా తీసి ఉంచాలి.
6. యోగాసనాలు వేసేటప్పుడు మాట్లాడకూడదు . నిశ్శబ్దంగా ఉండాలి.
7. బిగుతుగా ఉన్న వస్త్రాలను ధరించకూడదు. తేలిక రంగులని , వదులుగా ఉండే వస్త్రాలయితే మంచిది .
8. గడియారం , కడియం, ఉంగరాల వంటివి ధరించకూడదు .
9. ఎటువంటి ఉద్రేకం, ఉద్వేగ భావాలు లేకుండా, ప్రశాంత మనస్సుతో యోగాసనాలను అభ్యసించాలి.
10. ఆసనాల తరవాత వేడినీటి స్నానం చేయదలుచుకుంటే పదిహేను నిమిషాలు ఆగాలి.
11. *శీతాకాలంలో అయితే రోజుకి నలభై నిమిషాలకు మించి యోగాసనాలు చేయకూడదు . వేసవిలో అయితే అరగంట చాలు.*
12. యోగాసనాలు వేయడంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేయాలి. ఆకలనిపిస్తే తినాలి. అప్పుడు కూడా కడుపు నిండా తినకూడదు. కడుపులో సగభాగాన్నే ఆహారంతో నింపాలి. మిగతా ఇక భాగం నీటితో నింపి, మరో భాగాన్ని గాలికి వదిలేయాలి.
13. కాఫీ గాని, టీ గాని తీసుకోదలిస్తే, రోజుకి రెండు కప్పులకన్నా ఎక్కువ తీసుకోవద్దు . యోగాసనాలని ప్రారంభించిన కొత్తలో ఒళ్ళు నొప్పులు రావచ్చు, అయినా మానకూడదు . అలవాటు ప్రకారం ప్రతి రోజు వేస్తుంటే ఆ నొప్పులు వాటంతట అవే తాగిపోతాయి .
14. యోగాసనానికి, యోగాసనానికి మధ్య కొద్దిగా విశ్రాంతి ఉండాలి.

*యోగాసనాలు - వాటి లాభాలు*

*పద్మాసనం:*    
                                                                   
 * మొదట కాళ్ళు చాచి కూర్చోవాలి . వీపు నిటారుగా ఉంచాలి .   
* కుడికాలు మడిచి పైకి లేపి కుడి పాదం ఎడమ తొడ మీదకు వచ్చేలా పెట్టాలి.
* ఎడమ కాలు మడచి అలాగే కుడి తొడ మీద పెట్టాలి. చూడటానికి కాళ్ళు మెలిక వేసుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది .
* పాదాల అడుగు భాగం బొడ్డు ప్రాంతంలో ఉంచాలి. చేతులు రెండూ మోకాళ్ళ మీద ఆన్చాలి. 
* నెమ్మదిగా ఊపిరి పీల్చి వదలండి. ఐదు శ్వాసల తో మొదలుపెట్టి పది శ్వాసల కాలం వరకూ కూర్చోవడానికి ప్రయత్నించాలి .
ఉపయోగాలు : పద్మాసనం వలన మెదడు ప్రశాంతతమవుతుంది. నాడులు, కండరాలు బలపడతాయి. ప్రోస్టేట్ గ్రంధి సమస్యలు, స్త్రీల ఋతుచక్రంలో తేడాల సమస్యలకు చికిత్సగా ఉపయోగపడుతుంది .
హెచ్చరిక : మోకాలి నొప్పులున్నవారు పద్మాసనం ప్రాక్టీస్ చేయరాదు .

*వజ్రాసనం :*

* మొదట కాళ్ళు చాచి కూర్చోవాలి. వీపు నిటారుగా ఉంచాలి.  
*కుడి కాలుని మోకాలు వద్ద వంచి పాదాన్ని కుడి పిరుదు కిందకు 
చేర్చాలి.
* అలాగే ఎడమ కాలుని మడిచి పాదాన్ని ఎడమ పిరుదు కిందకు
చేర్చాలి .
* రెండు చేతులతో కాళ్ళ ముడుకులు పట్టుకుని నడుము వంగకుండా నిటారుగా వుండాలి.
* కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకుంటూ శ్వాసను సాధ్యమైనంతవరకు బంధించి నిదానంగా వదలాలి .
ఉపయోగాలు : ఈ ఆసనం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. తొడలు , కాలి పిక్కల కండరాలు ధృడంగా తయారవుతాయి. 
హెచ్చరిక : ఫైల్స్ తో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయరాదు .

*అర్థ పవన ముక్తాసనం*

* వెల్లకిలా పడుకోవాలి. గాలి లోపలికి పీల్చాలి.      
* ఎడమ కాలిని మోకాలి వద్ద మడవాలి.      
* రెండు చేతులతో మోకాలిని పొత్తి కడుపు మీదికి తేవాలి, కుడి కాలిని చాపే ఉంచాలి.
* ఊపిరి బిగపట్టి తల ఎత్తి ముక్కుతో మోకాలిని తాకాలి.
* శ్వాస విడుస్తూ ఎడమ కాలిని తిరిగి నిలువుగా చాపాలి.
* ఇప్పుడూ శ్వాస పీలుస్తూ కుదికాలిని కూడా పైన చెప్పిన విధంగా చేయాలి.
ఉపయోగాలు : కాలేయం, క్లోమం పని తీరును మెరుగుపరుస్తుంది . కడుపులోని గ్యాస్ తీసివేస్తుంది . దీని వల్ల గ్యాస్ ట్రబుల్ ఉండదు. కడుపు భాగంలో పేరుకునే కొవ్వు పరిమాణం తగ్గుతుంది. పోస్ట్ మెనోపాజ్ స్టేజ్ లోని మహిళలకు ఇది చాలా ఉపయోగకరం . కడుపు భాగంలోనే కాక, తొడలు మోకాళ్ళ కండరాలు బలోపేతమవుతాయి .
హెచ్చరిక : మోకాళ్ళ నొప్పులు, కడుపులో అల్సర్లు వున్నవారు ఇది చేయరాదు.

*పవన ముక్తాసనం*

* వెల్లకిలా పడుకోవాలి గాలి లోపలికి పీల్చాలి.                            
* రెండు కాళ్ళను ఎత్తి మోకాలి వద్ద మడవాలి .
* రెండు చేతులతో మోకాళ్ళను పొట్టి కడుపు మీదకు తేవాలి 
* ఊపిరి బిగపట్టి, తలను ఎత్తి, ముక్కుతో మోకాళ్ళను తాకాలి.
* శ్వాస విడుస్తూ తిరిగి కాళ్ళను చాపుతూ మామూలు స్థితికి రావాలి.
ఉపయోగాలు : కడుపులోని గ్యాస్ తీసివేస్తుంది. ఉదార కండరాల పని తీరు మెరుగవుతుంది. ఛాతీ భాగం, భుజాలు, చేతుల నొప్పులు పోగొడుతుంది. కడుపు భాగంలో పేరుకునే కొవ్వు పరిమాణం తగ్గుతుంది. పోస్ట్ మెనోపాజ్ స్టేజి లోని మహిళలకు ఇది చాలా ఉపయోగం. కడుపు భాగంలోనే కాక, తొడలు, మోకాళ్ళ కండరాలు బలోపేతమవుతాయి .
హెచ్చరిక : మోకాళ్ళ నొప్పులు, కడుపులో అల్సర్లు వున్నవారు ఇది చేయరాదు .

 *పశ్చిమోత్తానాసనం*

         గాలి వదిలి ముందుకు వంగి చేతులతో పాదాలను తాకి, తలను మోకాలుకు తగిలించాలి. శ్వాసక్రియ మామూలుగా జరపాలి. కాళ్ళు వంపు లేకుండా వుండాలి. గాలి పీల్చి నెమ్మదిగా తలను పైకెత్తి సాధారణ స్థితికి రావాలి.
ఉపయోగాలు : జ్ఞాపక శక్తిని పెంపొందింప చేసి , ఉదర అంగాల పనితీరును మెరుగుపరుస్తుంది . వెన్నుకు బలాన్ని ఇస్తుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి అంగాలకు బలం చేకూరుస్తుంది .
హెచ్చరిక : వెన్ను సమస్య ( బ్యాక్ పెయిన్ ), కడుపులో పుండు , వరిబీజం కలవారు ఈ భంగిమ వేయవద్దు.

*భుజంగాసనం*

నేలమీద బోర్లా పడుకోవాలి. అరచేతులను ఛాతీకి ఇరువైపులా ఉండేలా పెట్టండి. గాలిని పీలుస్తూ తల, ఛాతీ, బొడ్డు భాగం వరకు పైకి ఎత్తాలి. చేతులను మోచేయి భాగంలో ఉంచాలి. శ్వాసక్రియ మామూలుగా చేసి, ఆ తర్వాత గాలిని వదులుతూ సాధారణ స్థితికి రావాలి.
ఉపయోగాలు : ఇది వెన్నునొప్పిని, అస్తమా , మలబద్ధకం , షుగర్ వంటి వాటిని బయటపడేస్తుంది. స్త్రీలకు మంచి శరీర సౌష్టవాన్ని కలుగజేస్తుంది .
*హెచ్చరిక* : వెన్ను సమస్య ( బ్యాక్ పెయిన్ ) , కడుపులో పుండు, వరిబీజం కలవారు ఈ భంగిమ వేయవద్దు.

*ధనురాసనం*

      నేల మీద బోర్లా పడుకుని చేతులని ఆనించండి. ముఖం కుడి వైపుకి తిప్పి మోకాళ్ళ వద్ద వంచి పాదాలు పైకి లేపండి. పాదాలను పిరుదులకు దగ్గరగా తీసుకురండి. చేతులను వెనక్కి చాపి, పాదాలను చీలమండల వద్ద పట్టుకోవడానికి ప్రయత్నించండి . మోకాళ్ళు, పాదాలు రెండు సాధ్యమైనంత వరకు దగ్గరగా వుండేలా చూడండి.
       గాలిని బలంగా లోపలికి పీల్చి మెడను తలను పైకి చాపాలి. ఊపిరి బిగపట్టి, చేతుల్ని వంచకుండా పూర్తి శరీరాన్ని పైకి లేపాలి. తల, ఛాతీభాగం , తొడభాగం నేలమీదినుంది పైకి లేపాలి . ఈ స్థితిలో 5 నుండి 6 సెకన్లు ఉండాలి.
        చేతులతో చీలమండలు పట్టుకునే, గాలి విడుస్తూ నెమ్మదిగా తిరిగి పూర్వపు స్థితికి రావాలి. తల పక్కకు వంచి నేలకు ఆనించాలి, ఊపిరి సాధారణంగా తీసుకోవాలి.
      చేతులను తిరిగి పూర్వపు స్థితిలో ఉంచాలి, కాళ్ళను నెమ్మదిగా నేల మీద నిటారుగా చాపాలి. 6 నుండి 8 సెకన్ల వరకూ విశ్రాంతి తీసుకుని తిరిగి రెండవ సారి ధనురాసనం చేయవచ్చు .
*ఉపయోగాలు :*
 మొదటిసారిగా చేస్తున్నప్పుడు చీలమండలం పట్టుకోవడం కష్టమనిపిస్తే, పాదాల వేళ్ళను పట్టుకోవచ్చు. ఈ ఆసనం వల్ల శరీరంలోని అన్ని రకాల కీళ్ళ జాయింట్లు బలోపేతమవుతాయి . పొట్ట, నడుము భాగంలోని కొవ్వుని కరిగిస్తుంది . జీర్ణ శక్తిని పెంచుతుంది . వెన్నెముకకు సాగే గుణాన్ని ఇస్తుంది. దీని వలన  పొడుగు పెరిగే అవకాశముంది. ఆ ఆసనం వల్ల దీర్ఘకాలపు జీర్ణకోశవ్యాధులు, ప్రేగుల నొప్పులు తగ్గుతాయి. అస్తమా , మధుమేహం, మలబద్ధకం , నాడీబలహీనత , తీరు మారిన బహిష్టులు వంటి సమస్యలను తొలగిస్తుంది .
*హెచ్చరిక :*
గుండె జబ్బులు, కడుపులో కురుపు, వరిబీజం , వెన్నుపూసల నొప్పి వంటివి గలవారు ఈ ఆసనం వేయకూడదు .

*అర్థ హలాసనం*

గాలిని లోపలికి పీలుస్తూ ఎడమ కాలును పైకి ఎత్తాలి. మోకాలు దగ్గర కాలు వంగకూడదు, గాలిని పీల్చి వదలాలి. ఆ తర్వాత ఎడమ కాలు దించి కుడికాలు పైకి ఎత్తి అదే పద్ధతిలో గాలి పీల్చి వదలండి .
*ఉపయోగాలు* : ఇది నడుము కింది భాగానికి, మోకాలు కీళ్లకు, ఉదర కండరాలకు తగిన వ్యాయామం . కీళ్ళ నొప్పులకు నడుము కింది భాగం, వెన్నునొప్పికి ఇది బాగా పనిచేస్తుంది .
*హెచ్చరిక :* వెన్ను సమస్య ( బాక్ పెయిన్ ), కడుపులో పుండు, వరిబీజం కలవారు ఈ ఆసనం వేయవద్దు .

*హలాసనం*

గాలి పీలుస్తూ కాళ్ళను పైకి ఎత్తండి. గాలి వదులుతూ కాళ్ళను తల మీదుగా వెనక్కి తీసుకువెళ్ళి కాలి వేళ్ళను నేలకు తాకించాలి. చేతులను వెనక్కి చాచి పాదాల దగ్గరికి తీసుకువెళ్ళాలి . శ్వాసక్రియ మామూలుగా కొనసాగించాలి . గాలి లోపలికి పీలుస్తూ కాళ్ళను పైకి ఎత్తాలి. గాలిని వదులుతూ కాళ్ళను సాధారణ స్థితికి కిందికి దించాలి. ఇదే భంగిమ మరో రెండు సార్లు చేయాలి .
*ఉపయోగాలు* : దీని వలన జీర్ణక్రియ మెరుగవుతుంది . వెన్నుకు వీపు కండరాలకు బలమిస్తుంది . అస్తమా , మలబద్ధకం, షుగర్ ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది .
*హెచ్చరిక :*
: అధిక రక్త పోటు గలవారు , గుండె జబ్బులు వున్నవారు , వరిబీజం, అల్సర్ , స్సాండిలోసిస్ వున్నవారు ఈ ఆసనం వేయవద్దు .

*మత్స్యాసనం*

పద్మాసనంలో కాళ్ళు మెలిక వేసినట్టుగా వేసి వెనక్కి పడుకోవాలి .  
గాలి లోపలికి పీల్చి ఛాతీని పైకి లేపండి. మెడను  వెనక్కి వంచండి. శ్వాసక్రియ సాధారణ స్థాయిలోనే చేయండి. గాలిని వదులుతూ మోకాళ్ళ మీద బరువు పెడుతూ సాధారణ స్థితికి రావాలి .
*ఉపయోగాలు :*
ఈ ఆసనం శ్వాసక్రియను మెరుగు పరుస్తుంది . థైరాయిడ్ , పారా థైరాయిడ్ గ్రంథుల సమస్యలను తగ్గిస్తుంది. వెన్ను సులభంగా కదిలేలా చేయగలదు .
హెచ్చరిక : వెన్ను సమస్య (బాక్ పెయిన్), కడుపులో పుండు, వరిబీజం కలవారు ఈ భంగిమను వేయవద్దు .

*మకరాసనం*

మకరం అంటే మొసలి అని అర్థం. ఎక్కువగా నీటిలో చురుగ్గా తిరిగే మొసళ్ళు , బాడీ టెంపరేచర్ పెరగడం కోసం నేల మీదకు వచ్చి ఇసుకలో విశ్రాంతిగా పడుకుంటాయి. ఇదే భంగిమని అనుకరించేదే మకరాసనం. ఇది ఎలా చేయాలంటే …
1. మందపాటి దుప్పటి లేదా కార్పెట్ మీద చేతులు రెండూ ముందుకు చాచి, బోర్లా పడుకోవాలి.
2. రెండు కాళ్ళ మధ్య ఎడం వుంచి, వెడల్పుగా చాచాలి .
3. కుడి చేతిని ఎడమ భుజం మీద, ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచాలి.
4. ఇప్పుడు తలని క్రాస్ గా వున్న చేతుల మధ్య ఆన్చి ఉంచాలి. లేదా చేతుల్ని క్రాస్ గానే నేలమీదకు ఉంచి, తలను చేతుల మీదికి ఆన్చి వుంచవచ్చు .
5. అలా రిలాక్సవుతూ. మొదట 5 శ్వాసల్తో మొదలు పెట్టి, తర్వాత పది శ్వాసల వరకు వుండటానికి ప్రయత్నించవచ్చు .
ఉపయోగాలు:
         చాలా తేలికగా ఎవరైనా చేయదగిన ఆసనమిది. హై బీపి సమస్య తో  బాధపడేవారికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది . హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు కూడా మకరాసనం చేయవచ్చు .

 *అర్థకటి చక్రాసనం*

కటి అంటే సంస్కృతంలో నడుము భాగం అని అర్థం . నడుము భాగం లోని కండరాలకు బలాన్నిచ్చే ఆసనం అన్నమాట . చక్రాకారంలో శరీరాన్ని వంచడం వల్ల దీన్ని చక్రాసనం అని కూడా అన్నారు .
*చేసే విధానం:*
1. మొదటగా నిటారుగా నిలబడి చేతులు పిరుదుల ప్రక్కలకు ఆన్చాలి.
2. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ, కుడి చేతిని భుజం వరకు పైకి
ఎత్తాలి .
3. గాలిని వదిలి, అర చేతిని పైకెత్తి, గాలిని పీల్చుకుంటూ కుడి చేతిని తల వరకు తీసుకురావాలి.
4. తిరిగి గాలిని వదులుతూ కుడి చేతి వంక చూస్తూ, నడుము భాగం వరకు ఆర్చ్ లాగ ప్రక్కకు వంచాలి . ఎడమ చేతితో మోకాలిని తాకడానికి ప్రయత్నించండి.
5. మళ్ళీ నెమ్మదిగా గాలిని పీల్చుతూ నడుముని నిటారుగా ఉంచాలి.
6. గాలిని వదులుతూ కుడిచేతిని భుజం వరకు తీసుకు రావాలి .
7. గాలి పీల్చి, పైకి ఉంచిన అరచేతిని క్రిందికి వంచి , గాలి వదులుతూ చేతిని కిందికి దింపాలి.
8. రెండు కాళ్ళు ఎడంగా ఉంచి రిలాక్సవ్వండి .
9. మళ్ళీ ఎడమ చేతితో ఇదే విధంగా రిపీట్ చేయండి .
*ఉపయోగాలు :*
     ఊపిరితిత్తులకు, నడుం భాగంలోని కండరాలకు బలాన్నిస్తుంది . నడుం భాగంలోని కొవ్వుని కరిగించి
సన్నబరుస్తుంది. శరీరాన్ని ప్రక్కకు వంచడం వలన వెన్నుపాముకు సాగే గుణాన్ని పెంచుతుంది .

 *త్రికోణాసనం*

శరీరాన్ని త్రికోణాకారంలో వంచడం ఈ ఆసనంలోని ప్రత్యేకత.
*చేసే విధానం :*
1. కాళ్ళు, వెన్ను భాగము, తల ఒకే వరసలో ఉండేలాగా 
నిటారుగా నిలబడాలి.
2. కుడి కాలిని రెండు అడుగుల దూరంగా ఉండేలా జరపాలి.
3. రెండు చేతుల్ని ప్రక్కలకు వెడల్పుగా చాపాలి .
4. ఊపిరి వదులుతూ కుడి చేతిని, కుడి కాలి వద్దకు చేరేలా నడుము భాగాన్ని వంచాలి,మోకాలిని వంచకుండా జాగ్రత్త వహించాలి.
5. తలను పైకి ఎత్తి, ఎడమ చేతి వంక చూస్తుండాలి . ఈ భంగిమలో శరీర భాగాలన్నీ త్రికోణాకారంగా అమరి  ఉంటాయి.
6. నెమ్మదిగా కుడి చేతిని పైకి లేపి, తిరిగి నిటారుగా నిల్చోవాలి.
7. మళ్ళీ ఎడమ చేతితో ఇదే విధంగా ఆసనం రిపీట్ చేయాలి.
 
*ఉపయోగాలు :*
వెన్ను నొప్పి తగ్గిస్తుంది , ఛాతీకి, నడుముకు , తొడల భాగాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది .
హెచ్చరిక: ఏవైనా ఆపరేషన్ లు జరిగిన వారు , శారీరక సమస్యలున్న వారు ఈ ఆసనం చేయవద్దు .

 *పరివృత్త త్రికోణాసనం*

     శరీరాన్ని త్రికోణాకారంగా వంచడమే కాక శరీరంలోని కండరాలన్నీ కుడి నుండి ఎడమకు, ఇంకా ఎడమ నుండి కుడికి మడిచినట్లవుతాయి . అందుకే దీనికి పరివృత్త త్రికోణాసనం అన్న పేరు వచ్చింది . శరీర భాగాలన్నింటికీ రక్తప్రసరణ పెంచి, చురుకు దనాన్నిస్తుంది.
 
*చేసే విధానం* : 
1. కాళ్ళు, వెను భాగం, తల ఒకే వరసలో ఉండేలాగా నిటారుగా నిలబడాలి.
2. కుడి కాలిని రెండు అడుగుల దూరంగా ఉండేలా జరపాలి .
3. రెండు చేతుల్ని ప్రక్కలకు వెడల్పుగా చాపాలి.
4. ఊపిరి వదుల్తూ , శరీరాన్ని నడుము భాగం నుండి ముందుకు వంచాలి.
5. నెమ్మదిగా ఎడమ చేతికి కుడి కాలు అంటేలా వంగి, అరచేతిని నేలపై ఆన్చి ఉంచాలి., అదే సమయంలో  కుడిచేతిని చూస్తూ ఉండాలి.
6. ఈ సమయంలో మోకాలు వంచకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి.
7. నెమ్మదిగా ఎడమ చేతిని తిరిగి యథా స్థానానికి తీసుకు రావాలి.
8. ముందుకు వంగిన శరీర భాగాన్ని లేపి, చేతులు కిందికి దించి, కుడి కాలుని తిరిగి ఎడమ కాలి దగ్గరకు చేర్చి నిటారుగా నిలబడాలి.
9. రెండు కాళ్ళ మధ్య కొద్దిగా ఎడమిచ్చి, అర నిమిషం రిలాక్సవ్వవచ్చు. మళ్ళీ నిటారుగా నిల్చుని ఎడమ కాలితో మొదలుపెట్టి, ఆసనం పూర్తి చేయాలి .
ఉపయోగాలు : ఇది కొద్దిగా కష్టతరమైన ఆసనమైనా విద్యార్థులకు , నేటి సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మంచి చురుకుదనాన్ని , శరీర పటిష్టతని ఇచ్చే ఆసనమిది .
*హెచ్చరిక :*
ఏవైనా ఆపరేషన్ లు జరిగిన వారు, శారీరక సమస్యలున్న వారు ఈ ఆసనం చేయవద్దు .
ధన్యవాదములు 🙏🏻
 *మీ నవీన్ నడిమింటి*
   9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment