Wednesday 20 December 2023

మధుమేహం (షుగర్) సమస్య - అద్భుతమైన ఆయుర్వేద మరియూ గృహ చికిత్స నివరణా మార్గాలు

✍️ *మధుమేహం (షుగర్) సమస్య - అద్భుతమైన ఆయుర్వేద మరియూ గృహ చికిత్స నివరణా మార్గాలు:*

*విన్నపం:*
 
*మిత్రులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఈ విలువైన ఆరోగ్య సమాచారాన్ని మీకోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొంచెం ఓపిక పెట్టి మొత్తం చదివి అర్థం చేసుకుని పాటించగలరని మనవి.*

👉చరిత్రలో మొట్టమొదటగా మధుమేహాన్ని గూర్చిన సమగ్రమైన వివరణ ఇచ్చింది ఆయుర్వేద గ్రంథాలే. 

👉చరక సుశృత సంహితలు గ్రంథస్తమైన కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా... నాటికీ, నేటికీ... వ్యాధి మౌలిక దృక్పథంలో ఏ మాత్రం మార్పు లేక పోవటం వైద్య శాస్త్రవేత్తలను విస్మయ పరుస్తోంది.

👉 "వాత వ్యాధీ ప్రమేహశ్చ....” అంటూ సుశృతుడు ఎనిమిది మహారోగాలలో మధుమేహాన్ని చేర్చి చికిత్సాపరంగా దీనికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు. 

👉ఎక్కువ మోతాదులో మూత్రం (మేహం) వెళుతుంది కాబట్టి దీనికి ప్రమేహమని పేరు. అలాగే మూత్రం చక్కెరతో (మధు) కలిసి విసర్జితమవుతుంది. కనుక దీనికి మధుమేహమని పేరు వచ్చింది. 

👉దీనిలో 'ప్రభూత-మూత్రత (మూత్రం ఎక్కువ మోతాదులో రావటం), అవిల మూత్రత (మూత్రం చిక్కగా రావటం) అనే రెండు ప్రధానమైన లక్షణాలుంటాయని శాస్త్రకారుడు చెప్పాడు.

👉 మధుమేహానికి సరిపోలిన ఇంగ్లీషు పదం డయాబెటిస్ మెల్లిటస్ కూడా ఇదే అర్థాన్ని ధ్వనించడం గమనార్హం! డయాబెటిస్ అనేది గ్రీకు పదం. ప్రవహించడమని దీని అర్థం. అలాగే మెల్లిటస్ అనేది లాటిన్ పదం. తేనె అని అర్థం. డయాబెటిస్ మెల్లిటస్ అంటే, తేనె వంటి ద్రవం శరీరం నుంచి ప్రవహించడమని అర్థం.

👉మధుమేహంలో వాత, పిత్త, కఫాల జోక్యం ఉన్నప్పటికి ప్రధానంగా కఫ వాతాలు దూషితమవుతాయి. 

👉శ్లేష్మం పెరిగే ఆహార విహారాల వలన కఫం ఆమాశయంలో జమ చేరి పాంక్రియాస్ బలహీనమవుతుంది. 

👉ఈ పాంక్రియాస్ ఇన్సులిన్ ను పూర్తి స్థాయిలో విడుదల చేయలేకపోవడంతో రక్తంలో ఉన్న చక్కెర నిల్వలు కణజాలాలలోకి వెళ్లలేవు. 

👉దీనితో శరీరానికి రావలసిన శక్తి అందకపోగా, గుండె, మూత్రపిండాల వంటి ప్రధాన అంతర్గత అవయవాల మీద అదనపు వత్తిడి పడుతుంది. 

👉ఈ విధంగా మధుమేహమూ, దానిని అనుసరించి ఇతర ఇక్కట్లు వస్తాయి. 

👉శారీరక క్రియలు సక్రమంగా జరగకపోవడానికి కారణం వాతదోషం కనుక, మధుమేహం వాత ప్రధాన వ్యాధిగా నమోదయింది.

👉మధుమేహం ఎందుకు ప్రాప్తిస్తుందనే దానికి సుశృతుడు ఇచ్చిన వివరణ అత్యంత ప్రామాణికతను సంతరించుకుంది. 

👉'సహజో ఆపథ్యనిమిత్తా...' అంటూ మధుమేహం ప్రధానంగా రెండు రకాలని, వంశపారంపర్యత, బీజ దోష వికృతి వంటి సహజమైన కారణాలచేత వచ్చేది మొదటి రకమని, అపథ్యాలైన ఆహార విహారాలను పాటించడం వలన సంక్రమించేది రెండవ రకమనీ సుశృతుడు పేర్కొన్నాడు. 

👉మొదటి రకాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా జువనైల్ డయాబెటిస్ తోను, రెండవ రకాన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ తోనూ పోల్చవచ్చు.

👉మధుమేహం వ్యక్తమవ్వటానికి ముందుగా శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆయుర్వేదం ఈ లక్షణాలను 'పూర్వరూపాలు' అంటుంది. 

👉ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు కనుక అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి పురోగమనాన్ని అరికట్టవచ్చు.

👉 శరీరమంతా జిగటగా తిమ్మిరి పట్టినట్లు ఉండటం (చిక్కనతా దేహే), 

👉దంతాలు, కళ్లు మొదలైన భాగాల్లో మలినాలు ఎక్కువగా చేరడం (దంతాధీనాం మలాద్యత్వం),

👉 నోరు తడారి పోవటం (గళ తాలు శోష), 

👉కాళ్లు, చేతుల్లో మంటగా అనిపించటం (హస్త పాద తల), 

👉వెంట్రుకలు, గోళ్లు ఎక్కువగా పెరగటం (కేశ నఖాతివృద్ధి), 

👉మూత్రం నుంచి తియ్యని వాసన రావటం (మధుర మూత్రత), 

👉ఎక్కువగా దాహం వేయటం (పిపాసా),

👉 అనుత్సాహంగా అనిపించటం (అవసాదం),

👉 చల్లని పదార్థాలంటే ఇష్టంగా అనిపించటం (శీత ప్రియత్వం), 

👉నిస్త్రాణగా అనిపించటం (శిథిలాంగత), 

👉కొద్దిపాటి పనికే ఆయాసం రావటం (శ్వాస),

👉 నోటిలో తియ్యగా అనిపించటం (స్వాదు ఆస్యత), 

👉ఎప్పుడూ విశ్రమించాలని అనిపిస్తుండటం (స్వప్న సుఖే రతి), 

👉కునికిపాట్లు పడుతుండటం (తంద్ర), 

👉చెమటలు ధారలుగా కారుతుండటం (స్వేదో గంధా)... 

👉ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాటిని మధుమేహ పూర్వరూపాలుగా భావించాల్సి ఉంటుంది. 

👉చికిత్స విషయానికి వస్తే, సంహితాకారులు రక్తంలోని చక్కెరను తగ్గించటం కంటే, 'సంప్రాప్తి విఘటన'కు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. 

👉సంప్రాప్తి అంటే, వ్యాధి ప్రాదుర్భావం నుంచీ ఉపద్రవాల వరకూ కొనసాగే వివిధ దశలు, దోషాలు కొద్దిగా పెరిగినప్పుడు ఆహారనియమాలతో పాటు శారీరక వ్యాయామాలు అవసరమవుతాయి.

👉 దోషాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందితే ఆహార వ్యాయామాలతో పాటు ఔషధాలు కూడా అవసరమవుతాయి. ఒకవేళ దోషాలు మరీ ఎక్కువగా వృద్ధి చెందితే, ఔషధ, ఆహార, వ్యాయామ సూచనలతో పాటు దోషాలను సమూలంగా బైటకు పంపడానికి శోధన చికిత్సలను చేయాల్సి ఉంటుంది. వీటిని పంచకర్మ చికిత్సలు అంటారు.

👉సంక్షిప్తంగా చెప్పాలంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, మధుమేహ చికిత్స రెండు ప్రధానమైన విభాగాలుగా జరుగుతుంది:

*1) ఆహార చికిత్స 2) ఔషధ చికిత్స.*

*1. ఆహార చికిత్స:*

👉మీరు ఇంతకు మునుపు ఏ ఆహారం తీసుకుంటున్నారో అదే కొనసాగించవచ్చు. వరి అన్నం మానేసి హడావుడిగా గోధుమ రొట్టెలు మొదలెట్టాల్సిన పనిలేదు. కాకపోతే తీపి పదార్థాలను, అధికంగా క్యాలరీలను విడుదల చేసే పదార్థాలను త్యజించాల్సి ఉంటుంది. 

👉అంటే చక్కెర, స్వీట్లు, బెల్లం, గ్లూకోజ్, జీడిపప్పు, వేరుశనగ, కొబ్బరి, కూల్డ్రింక్స్, మద్యం, అరటి, మామిడి, పనస, సపోట మొదలైన వాటిని మీ ఆహారం నుంచి తొలగించాలి.

👉మధుమేహంలో ఆకలి ఎక్కువగా వేస్తుంటుంది. అలా అని ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో అల్పస్థాయిలో తయారయ్యే ఇన్సులిన్ మోతాదు ఆహారం నుంచి తయారయ్యే గ్లూకోజ్ను పూర్తిగా దహనం చెందించలేదు. దీనితో రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. అందుచేత ఆహారాన్ని చిన్న చిన్న మోతాదులలో తరచుగా తీసుకోవడం మంచిది.

👉ఆహారంలో దుంప కూరలను మానేయాలి. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వలన గ్లూకోజ్ ఎక్కువగా తయారు కావడమే కాకుండా వాతం కూడా పెరుగుతుంది. మధుమేహం వాత ప్రధాన వ్యాధి అనే సంగతి ఇంతకు ముందే పేర్కొనడం జరిగింది.

👉కొవ్వు పదార్థాలను పూర్తిగా మానేయాలి. అలాగే నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె మొదలైనవి రోజు మొత్తానికి మూడు, నాలుగు చెంచాలకు పరిమితం చేసుకోవడం మంచిది. మధుమేహం విషయంలో కోడిగుడ్డులోని పచ్చసొన, డాల్డా తదితరాలు కూడా మంచివి కాదు.

✍️ *ఆహారం తీసుకోవాల్సిన పద్ధతి, ప్రణాళిక:*

✍️  *ప్రాతః కాలం:*

👉రెండు చెంచాల మెంతులు రాత్రంతా నీళ్లలో నానేసి ఉదయం నిద్ర లేచిన తరువాత నమిలి వేడి నీళ్లు తాగాలి. (లేదా)

👉అరకప్పు ఉసిరిపండ్ల రసంలో చిటికెడంత పసుపు కలుపుకొని తాగాలి. (లేదా)

👉 కాకరకాయ రసాన్ని వేడి నీళ్లతో కలిపి తాగాలి.

✍️ *ఉదయం తీసుకోవాల్సిన అల్పాహారం:*

👉ఉప్మాను జారుడుగా చేసుకొని చిన్న గరిటెడు తినాలి (కొద్దిగంత నెయ్యి తాళింపుతో) (లేదా)

👉అటుకులతో చేసిన ఉప్మాను బఠాణీలు, ఉల్లిపాయలతో సహా తినాలి. (లేదా)

👉 మొక్కజొన్నలతో చేసిన ప్లేక్స్ను పాలలో నానేసి తినాలి. (లేదా)

👉ఉడికించిన కోడిగుడ్డును పచ్చసొన
తొలగించి తినాలి. తరువాత...

👉కూరగాయలతో చేసిన సూప్ను గానీ, టమాటా సూప్ను గానీ తాగాలి. (లేదా)

👉వెన్న తీసిన పాలు తాగాలి. (లేదా)

👉 పుచ్చకాయ, బత్తాయి, క్యారెట్, ఆపిల్... మొదలైన పండ్లనుంచి తీసిన రసాన్ని తాగాలి.(చక్కెర లేకుండా)

✍️ *మధ్యాహ్నం భోజనం:*

👉భోజనానికి ముందు దోసకాయ, టమాట, ఉల్లి, క్యారెట్ మొదలైన వాటితో సలాడ్ చేసుకొని తినాలి.

👉గోధుమలతో చేసిన చపాతీలను గానీ, పరిమిత మోతాదులో వరి అన్నాన్ని గానీ మెంతులతో కలిపి తయారు చేసుకొని తినాలి.

👉ఆకు కూరలను, కాయగూరలను వేపుడుగా కాకుండా పులుసు కూరలాగా చేసుకొని తగినంతగా తినాలి. 

👉బీన్స్, లేత వంకాయ, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటా, సొరకాయ, మునగ కాయ, పొట్లకాయ, బెండకాయ, దోసకాయ, బీరకాయ, దొండకాయ...వీటిలో దేనినైనా ఉడికించి తగినంత అల్లం, వెల్లుల్లి, మెంతులు, జీలకర్రలను కలిపి తీసుకోవచ్చు.

👉పెసర పప్పును గానీ, కందిపప్పును గానీ పలుచగా ఉడికించి తీసుకోవాలి. ఉడికిన తరువాత, అరుగుదల కోసం ఇంగువ, మిరియాలు, లవంగాలు, జీలకర్ర మొదలైన వాటితో వేయించి తీసుకోవచ్చు.

👉చివరగా పెరుగుకు బదులు మజ్జిగ పోసుకొని భోజనాన్ని ముగించాలి.

👉మాంసాహారులు చేపలను గానీ, స్కిన్ లెస్ చికెన్ ను గానీ పరిమితంగా తీసుకోవచ్చు.

✍️ *సాయంత్రం అల్పాహారం:*

👉అటుకులతోను, మరమరాలతోనూ మిక్చర్లా చేసుకొని ఉల్లిపాయ ముక్కలతో సహా తినాలి. (లేదా)

👉 బొప్పాయి(పండినది కాదు), దానిమ్మ, బత్తాయి మొదలైన
పండ్లను ముక్కలుగా చేసుకొని తినాలి. (లేదా)

👉మేరీ బిస్కెట్లను తినాలి, తరువాత.... 

👉వెన్న తీసిన పాలలో అశ్వగంధ చూర్ణం, శతావరి చూర్ణం మొదలైన చూర్ణాలను కలుపుకొని తాగాలి. (లేదా)

👉 కూరగాయలనుంచి తీసిన సూప్ను గానీ, టమాటా సూప్ను గానీ తాగాలి. (లేదా) 

👉టీలో అల్లం కలుపుకొని తాగాలి. (పంచదార కలపకుండా) (లేదా) 

👉నీటిలో నానేసిన ఖర్జూరాల నుంచి రసం పిండి, ఉసిరి రసంలో కలుపుకొని త్రాగాలి.

✍️ *రాత్రిభోజనం:*

👉ఇది మధ్యాహ్న భోజనం కంటే కాస్త తేలికగా ఉంటే మంచిది.

👉రాత్రి పడుకునే ముందు పల్చటి మజ్జిగ తాగాలి.

*2. ఔషధ చికిత్స:*

👉 మధుమేహ చికిత్సకు సంబంధించి త్రివిధ
చికిత్సా సిద్ధాంతాలున్నాయి.

1. అపతర్పణం (గుగ్గులు వంటి మూలికల ద్వారా శరీర బరువును నియంత్రించడం)

2. రోగ వ్యతిరేకం (తిప్పతీగ (గుడూచి), వేప బెరడు (నింబ), అడ్డసరం ఆకులు (వాసా), చేదుపొట్ల (పటోల) మొదలైన 'చేదు రుచి' కలిగిన మూలికలను
ప్రయోగించడం)

3. కారణానుగుణంగా (పాంక్రియాస్ నూ, కాలేయం వంటి అంతర్గత అవయవాలనూ కటుక రోహిణి, నేల ఉసిరిక వంటి మూలికలతో శక్తివంతం చేయడం)

✍️ *గృహ చికిత్సలు:*

👉మెంతులు మధుమేహ వ్యాధిలో బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను బట్టి మెంతులను 25 గ్రాములనుంచి 50 గ్రాములు వాడుకోవాలి. 

👉ముందు 25 గ్రాములతో ప్రారంభించాలి. ఉదయం అల్పాహారం సమయంలో రెండు టీస్పూన్లు, రాత్రి భోజన సమయంలో 2 టీస్పూన్లు తీసుకోవాలి.

👉 మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి అలానే మింగేయవచ్చు. లేదా మెంతులను పొడి చేసి నీళ్లతోగాని లేదా మజ్జిగతోగాని కలిపి భోజనానికి పావుగంట ముందు తీసుకోవచ్చు. ఒకవేళ చేదు రుచి సహించకపోతే మెంతులను చపాతి, అన్నం, పప్పు, కాయగూరలు వంటివాటితో కలిపి కూడా తీసుకోవచ్చు.

👉ఆకుపత్రి (తేజపత్ర) ఆకు పొడినీ, పసుపు పొడినీ ఒక్కోటి అరటీస్పూన్ చొప్పున తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుతో కలిపి భోజనం ముందు రెండు పూటలా తీసుకోవాలి. (కలబంద మట్టను నిలువునా మధ్యకు చీల్చి గుజ్జును చెంచాతో గీరి సేకరించవచ్చు).

👉పసుపు మధుమేహాన్ని సమర్ధవంతంగా ఆదుపు చేయగలుగుతుంది. ఫార్మామార్కెట్లో ఖాళీ క్యాప్సుల్స్ దొరుకుతాయి. డబుల్జీరో సైజువి తీసుకురావాలి. క్యాప్సుల్ని తెరిచి పసుపును కూరి నిల్వచేసుకోవాలి. వీటిని పూటకు రెండేసి చొప్పున మూడు పూటలా వాడుతుంటే మధుమేహంలో ఇతర మందుల మోతాదును క్రమంగా తగ్గించగలిగే అవకాశం ఏర్పడుతుంది.

👉కాకరకాయ రసం, వేప ఆకు రసం, సమాన భాగాలుగా కలిపి మోతాదుకు రెండేసి టీస్పూన్ల చొప్పున భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.

👉ఉసిరికాయ రసం, పచ్చి పసుపు కొమ్మురసం సమంగా తీసుకొని పూటకు టేబుల్ స్పూన్ చొప్పున రెండు పూటలా భోజనానికి ముందు తీసుకోవాలి. ఇవి తాజాగా దొరకని కాలంలో ఉసిరి వలుపు, పసుపు పొడిని సమ భాగాలుగా కలిపి, మోతాదుకు చెంచాడు చొప్పున రెండు పూటలా భోజనానికి ముందు అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి.

👉నల్లనేరేడు పండ్లను ఎండబెట్టి దంచి మెత్తగా పొడిచేసి మూడు వేళ్లకు వచ్చినంత పొడిని తీసుకొని అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి.

👉పదిగ్రాముల వేప చిగుళ్లకు రెండు మిరియం గింజల పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడుపున పుచ్చుకుంటూ ఉంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

👉కొబ్బరి పువ్వును మెత్తగా నూరి పెరుగుతో కలిపి 30 గ్రాముల మోతాదులో తీసుకుంటూ ఉండాలి. 

👉పదిగ్రాముల పత్తి గింజలను లీటర్ నీళ్లలో వేసి మరిగించి పావులీటరు మిగిలేటట్లు చల్లారిన తరువాత వడగట్టి ప్రతిరోజూ తాగుతుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

👉పొడపత్రి ఆకు (పుట్ట పొదర / మేషశృంగి) కషాయం రెండు టీస్పూన్ల మోతాదుతో ప్రారంభించి 3 టేబుల్ స్పూన్ల వరకూ పెంచుతూ వెళ్లి రోజువారీగా ప్రతిరోజూ తీసుకుంటూ ఉండాలి. ఆకు తాజాగా దొరకని కాలంలో ఆకుల చూర్ణాన్ని మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండు పూటలా అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి.

👉నాలుగు తులసి ఆకులు, నాలుగు బిళ్లగన్నేరు ఆకులు, 2 తమలపాకులు, తాంబూలం మాదిరిగా చుట్టి రెండు పూటలా తీసుకుంటూ 2 గ్లాసుల మజ్జిగను ఉదయ సాయంకాలాలు తాగుతుంటే 40 రోజుల్లో మంచి గుణం కనిపిస్తుంది.

👉మర్రిచెట్టు పచ్చిబెరడును దంచి, రసం తీసి ఈ రసాన్ని పూటకు 30 మిల్లీలీటర్ల చొప్పున తీసుకోవాలి.

👉మారేడు ఆకుల రసాన్ని రెండు టీస్పూన్ల మోతాదుగా ప్రతిరోజూ ఉదయం తాగుతుండాలి.

👉తంగేడు (ఆవర్తకీ) పువ్వుల చూర్ణాన్ని మోతాదుకు అరటీస్పూన్ చొప్పున నీళ్లతో కలిపి పుచ్చుకోవాలి.

👉వెంపలి గింజలు (శరపుంభా) చూర్ణం మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండు పూటలా అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి.

👉చేదుదొండ (బింబి) వేరు చూర్ణం మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండు పూటలా అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి.

👉వేగిస (విజయసార / బీజసార) చెట్టు పట్టను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కషాయం తయారుచేసుకొని పూటకు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున రెండు వూటలా భోజనానికి ముందు తీసుకోవాలి.

👉చేదుపొట్ల (పటోల) ఆకులు, వేపచెక్క బెరడు, తిప్పతీగ, ఉసిరి కాయలు పెచ్చులు, మాను పసుపు (దారు హరిద్ర) చెక్క వీటిని అన్నిటిని సమ భాగాలుగా కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా  రోజుకు రెండు సార్లు అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి.

👉దూసరితీగ సమూల కషాయాన్ని గరిటెడు తీసుకొని దానికి గరిటెడు ఆవుపాలు కలిపి పుచ్చుకుంటూ ఉంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

👉అడవిజీలకర్రను పొడిచేసి అరటీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

👉మారేడు ఆకులు, వేప ఆకులు, తులసి ఆకులు, మిరియంగింజలు... వీటితో తయారుచేసిన చూర్ణమిశ్రమాన్ని పూటకు ఒక గ్రాము మోతాదులో
రెండు పూటలా 3 నెలలుపాటు ఇచ్చినప్పుడు ఆశాజనకమైన ఫలితం కనిపిస్తుంది.

👉తిప్పసత్తు (గుడూచిసత్వం) 6 భాగాలు, చందనం పొడి, నిమ్మగడ్డి వేరు పొడి, వట్టివేరు పొడి, లవంగ మొగ్గ పొడి, శుద్ధశిలాజిత్తు పొడి వీటిని ఒక్కోటి ఒక్కో భాగం తీసుకొని అన్నిటినీ కలిపి, 500 మిల్లీగ్రాముల క్యాప్సుల్స్లో నింపి, 45 రోజులపాటు రెండు పూటలా ఇచ్చినప్పుడు రక్తంలో చక్కెర మొత్తాలు గణనీయంగా తగ్గినట్లు రుజువయ్యింది. 

👉నేరేడు గింజలు, పెద్దమాను (బీజసార) పట్ట, అత్తిచెట్టు (ఫిగ్ / మేడిపండు) మాను బెరడు, పొడపత్రి ఆకులు, కాకరకాయలు, తులసి ఆకులు, శుద్ధ శిలాజిత్ వీటిని సమాన భాగాలుగా తీసుకొని విడి విడిగా పొడి చేసి, అన్నిటినీ కలిపి, 500 మి.గ్రా. క్యాప్సుల్స్లో నింపి మూడు పూటలా, పూటకు ఒక్కోటి చొప్పున ఆరునెలలపాటు ఇచ్చినప్పుడు రక్తంలో అధికంగా సంచితమైన చక్కెర మొత్తాలు తగ్గటంతోపాటు కొలెస్టరాల్ కూడా తగ్గినట్లు తేలింది.

👉 ఓరల్ హైపోగ్లైసీమిక్ డ్రగ్స్ కి అంతగా ప్రతిస్పందించని వారిలో కూడా ఈ మిశ్రమం ఆశాజనకమైన ఫలితాలను ప్రదర్శించినట్లు అధ్యయనకారులు గమనించారు. 

👉అలాగే ఆహారం విషయంలోనూ, వ్యాయామం విషయంలోనూ ఎంత నిక్కచ్చిగా ఉన్నప్పటికీ ప్రయోజనం కనిపించని వారిలో కూడా ఇది చక్కని ఫలితాలను చూపించింది, అయితే, ఇన్సులిన్ మీద ఆధారపడిన వారిలో మాత్రం అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయింది.

👉మామిడి జీడి, నేరేడు గింజలు, కాకరకాయలు, పొడపత్రిఆకులు వీటి చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదులో రోజుకు మూడుసార్లు చొప్పున ఇస్తూ, ఆహారపు శక్తిని రోజుకు 1200 క్యాలరీలకు నియంత్రించినప్పుడు 60 శాతం కేసుల్లో చక్కని మార్పు కనిపించింది. అధ్యయనాన్ని ఆరునెలపాటు, 100 మంది వ్యక్తులమీద జరిపారు. రెండు వారాల తరువాత నుంచి వారు మామూలుగా వాడే ఓరల్ హైపోగ్లైసీమిక్ మందులను నిలిపేయటం జరిగింది.

👉నేలవేము (కిరాతతిక) సమూలం, నేలఉసిరిక సమూలం, నేరేడు గింజలు, వేపాకులు, తెల్లమద్ది (అర్జున) మాను బెరడు, మారేడు ఆకులు, త్రిఫలా కషాయంతో శుద్ధిచేసిన శిలాజిత్ పొడి... వీటి చూర్ణాలను సమాన నిష్పత్తి లో తీసుకొని అన్నిటినీ కలిపి 500 మిల్లీగ్రాముల క్యాప్సుల్స్లో నింపి పూటకు ఒకటి చొప్పున రెండు పూటలా తొమ్మిది నెలలపాటు ఇచ్చినప్పుడు మధుమేహం నియంత్రణలోకి రావడంతోపాటు ఈ వ్యాధిలో సర్వసాధారణంగా కనిపించే మూత్రాధిక్యత, నిస్త్రాణ, మలబద్ధకం, అతి ఆకలి, కళ్లు బైర్లుకమ్మటం, కండరాలనొప్పి, గుండెదడ, ఆకలి తగ్గటం వంటివి గణనీయంగా తగ్గాయి. 

👉నేలఉసిరిక మొక్కనూ, 20 మిరియాలను ముద్దగా నూరి ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

👉తురకవేప గింజలు, బియ్యం కడుగునీళ్లు ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

👉 నేల తంగేడు పువ్వులు లేదా గింజల పొడిని తాటి బెల్లంతో కలిపి నూరి పుచ్చుకుంటే ప్రమేహం నియంత్రణలో ఉంటుంది.

👉ఉసిరి వరుగు కషాయంలో పసుపునూ కొద్దిగా  తాటిబెల్లంనూ కలిపి పుచ్చుకుంటే ప్రమేహం నియంత్రణలో ఉంటుంది.

👉రెండు టీస్పూన్ల తిప్పతీగ రసానికి తాటిబెల్లం కలిపి పుచ్చుకుంటే ప్రమేహం బాధించదు.

👉త్రిఫలాలు, మానుపసుపు, తుంగముస్తలు, దేవదారుమాను వీటిని సమాన భాగాలు తీసుకొని దంచి, కషాయం తయారుచేసుకొని రెండుపూటలా పుచ్చుకుంటే ప్రమేహం శాంతిస్తుంది. 

👉కరక్కాయ చూర్ణం, ఉసిరికాయ చూర్ణం, తానికాయ చూర్ణం, శిలాజిత్ చూర్ణం వీటిని సమ భాగాలుగా కలిపి నిల్వచేసుకొని మోతాదుకు టీస్పూన్ చొప్పున అరకప్పు నీళ్లకు కలిపి పుచ్చుకుంటే అన్ని రకాల ప్రమేహాల్లోనూ హితకరంగా ఉంటుంది.

👉త్రిఫలాలు, శిలాజిత్, లోహభస్మం వీటిని సమాన భాగాలుగా కలిపి, అరటీస్పూన్ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తిప్పతీగ స్వరసానికి కలిపి కొంచెం తాటి బెల్లాన్నిగాని లేదా స్టీవియాపొడినిగాని చేర్చి పుచ్చుకుంటే అన్ని రకాల ప్రమేహాల్లోనూ హితకరంగా ఉంటుంది.

👉ఒక్కోటి 50 గ్రా. చొప్పున మారేడు ఆకులు, వేప ఆకులు, తులసి ఆకులు, మిరియాలు తీసుకొని చూర్ణించి పూటకు ఒక గ్రాము మోతాదులో రెండు పూటలా 3 నెలలపాటు వాడితే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.

👉తిప్పసత్తు (గుడూచిసత్వం) 60 గ్రా., చందనం పొడి, నిమ్మగడ్డి వేరు పొడి, వట్టివేరు పొడి, లవంగ మొగ్గ పొడి, శుద్ధశిలాజిత్తు పొడి వీటిని ఒక్కోటి 10 గ్రా కలపాలి. ఈ చూర్ణాన్ని 500 మిల్లీగ్రాముల క్యాప్సుల్స్లో నింపి, 45 రోజులపాటు రెండు పూటలా వాడితే మధుమేహం అదుపులోకి వస్తుంది.

👉నేలఉసిరిక మొక్కనూ, 20 మిరియాలను ముద్దగా నూరి ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

👉50 గ్రా. మామిడి జీడి, 50 గ్రా. నేరేడు గింజలు, 50 గ్రా. కాకర కాయలు, 50 గ్రా. పొడపత్రి ఆకులు వీటిని చూర్ణించి నిల్వచేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదులో రోజుకు మూడుసార్లు చొప్పున నీళ్లకు కలిపి వాడితే షుగర్ తగ్గుతుంది.

👉నేలవేము (కిరాతతిక) సమూలం 50 గ్రా., నేలఉసిరిక సమూలం 50 గ్రా., నేరేడు గింజలు 50 గ్రా., వేపాకులు 50 గ్రా., తెల్లమద్ది (అర్జున) మాను బెరడు 50 గ్రా., మారేడు ఆకులు 50 గ్రా., శుద్ధిచేసిన శిలాజిత్ పొడి 50 గ్రా.... వీటిని చూర్ణించి కలిపి 500 మిల్లీగ్రాముల క్యాప్సుల్స్లో నింపి పూటకు ఒకటి చొప్పున రెండు పూటలా తొమ్మిది నెలలపాటు వాడితే చక్కెరవ్యాధి తగ్గుతుంది.

👉నేరేడు గింజలు 50గ్రా., పెద్దమాను (బీజసార) పట్ట 50 గ్రా., అత్తిచెట్టు (ఫిగ్ / మేడిపండు) మాను బెరడు 50 గ్రా., పొడపత్రి ఆకులు 50గ్రా, కాకరకాయలు 50 గ్రా., తులసి ఆకులు 50 గ్రా, శుద్ధ శిలాజిత్ 50 గ్రా. వీటిని విడి విడిగా పొడి చేసి, అన్నిటినీ కలిపి, 500 మి.గ్రా. క్యాప్సుల్స్లో నింపి మూడు పూటలా, పూటకు ఒక్కోటి చొప్పున ఆరునెలలపాటు వాడితే షుగర్ తగ్గుతుంది.

👉 ఒక్కోటి 50 గ్రా చొప్పున కరక్కాయ చూర్ణం, ఉసిరి చూర్ణం, తానికాయ చూర్ణం, శిలాజిత్ చూర్ణం కలిపి టీస్పూన్ చొప్పున వాడాలి.

👉 త్రిఫలాలు, శిలాజిత్, లోహభస్మం ఒక్కోటి 50 గ్రా. కలిపి నిల్వచేసు కోవాలి. అరటీస్పూన్ పొడిని తిప్పతిగ స్వరసానికి కలిపి తాగాలి.

👉ఆకుపత్రి (తేజపత్ర) ఆకు పొడినీ, పసుపు పొడినీ ఒక్కోటి అరటీస్పూన్ చొప్పున తీసుకొని కలిపాలి. ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుతో కలిపి వాడాలి. 

👉కాకరకాయ రసం, వేప ఆకు రసం, సమాన భాగాలుగా కలిపి మోతాదుకు రెండేసి టీస్పూన్ల చొప్పున భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.

👉 5 గ్రా. తురకవేప గింజలు, 50 మి.లీ. బియ్యం కడుగునీళ్లు ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

👉5 గ్రా. నేల తంగేడు పువ్వులు లేదా గింజల పొడిని తాటి బల్లంతో కలిపి నూరి వాడితే ప్రమేహం నియంత్రణలో ఉంటుంది.

👉50 మి.లీ. ఉసిరి వరుగు కషాయంలో 3 గ్రా. పసుపునూ కలిపి వాడితే ప్రమేహం నియంత్రణలో ఉంటుంది.

👉రెండు టీస్పూన్ల తిప్పతీగ రసానికి అరచెంచాడు పాత తాటిబెల్లం కలిపి వాడితే ప్రమేహం బాధించదు.

✍️ *విన్నపం:*

*మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు. మీ వంతు బాధ్యతగా ఈ చిన్న సహాయం చేస్తారని ఆశిస్తున్నాను .*
*అందరూ బాగుండాలి.. అందులో  మనం ఉండాలి.*

           *_- సదా మీ శ్రేయోభిలాషి...🙏_*
           *_-మీ.. డా,,తుకారాం జాదవ్.🙏_*

No comments:

Post a Comment